న్యూఢిల్లీ: రాజ్యసభకు కేజ్రీవాల్?
పదేళ్లుగా ఢిల్లీలో అధికారాన్ని అనుభవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని చవిచూసింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం తన న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. దీంతో భవిష్యత్తులో ఆయన ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది.
ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్‌కు తాత్కాలిక భద్రతా గూడు పంజాబ్. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఆప్ ప్రభుత్వంలో ఉండటంతో, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అనూహ్యంగా లూధియానా వెస్ట్ ఉపఎన్నికలో రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపుతూ ఆప్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.
సంజీవ్ అరోరా 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కానీ, లూధియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మరణంతో ఏర్పడిన ఉపఎన్నికలో ఆప్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అరోరా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్థానాన్ని కేజ్రీవాల్‌కు కేటాయించేందుకు ఆప్ యోచిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజ్యసభ ఎంపీగా కేజ్రీవాల్ ఎంపికపై ఆప్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, రాజకీయ వర్గాల్లో ఈ వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. లూధియానా వెస్ట్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని స్వాగతిస్తున్నట్టు సంజీవ్ అరోరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమొచ్చింది.
ఉపఎన్నికలో గెలిస్తే, ఎమ్మెల్యేగా ఎన్నికైన అరోరాకు పంజాబ్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని, మరింత గట్టి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం ఖాయం అనే ప్రచారం కూడా మిన్నంటుతోంది.
ఢిల్లీ సీఎం పదవి కోల్పోయిన తర్వాత, కేజ్రీవాల్ తన సర్కారీ బంగ్లాను ఖాళీ చేసి, ప్రస్తుతం పంజాబ్ ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్నారు. దీంతో పంజాబ్ నుంచే ఆయన కొత్త రాజకీయ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.