ఏపీ: గత ఎన్నికల్లో ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరంగా ఉన్నా, తాజాగా మళ్లీ ప్రజల్లో ప్రత్యక్షమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన తర్వాత, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
తాజాగా నందిగామలో జరిగిన కార్యక్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా, ప్రజా సేవ మాత్రం ఆపలేనని స్పష్టం చేశారు. పదవిలో లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. గత పదేళ్లలో ఎవరితోనూ అనవసర సంబంధాలు లేకుండా పనిచేశానని తెలిపారు.
“నాకు విజయవాడ అంటే పిచ్చి” అంటూ కేశినేని నాని భావోద్వేగంగా మాట్లాడారు. రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన నగరానికి ఎప్పుడూ కృతజ్ఞుడినేనని చెప్పారు. అభివృద్ధి కోసం తన సహాయాన్ని ఎప్పుడూ అందిస్తానన్నారు.
దుర్గ గుడి ఫ్లైఓవర్ అనేది అసాధ్యమని అనుకున్న తరుణంలో, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సహాయంతో సాకారం చేశానని గుర్తు చేశారు. విజయవాడ అభివృద్ధికి తాను చేసిన కృషిని మరచిపోయారనే బాధ తనకు ఉందని అన్నారు.
తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇవ్వకుండా, ప్రజా సేవను మాత్రం కొనసాగిస్తానని కేశినేని నాని రీఎంట్రీకి సంకేతాలు ఇచ్చారు.