అమరావతి: ‘తల్లికి వందనం’ అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం.
ఏపీ బడ్జెట్‌కు భారీ కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించిన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు.
సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’, ‘ఉచిత బస్సు ప్రయాణం’ వంటి పథకాలను అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ మాదిరిగా మూడు విడతల్లో అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఉచిత బస్సు ప్రయాణానికి..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి సంబంధించి అధికారులు ప్రభుత్వం వద్ద నివేదిక సమర్పించారు. ఆర్థిక భారం, నిర్వహణ వ్యయాల అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ప్రకటన చేయనున్నారు.
‘తల్లికి వందనం’ – అర్హతలు ఖరారు
‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యాసంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులుండగా, 69.16 లక్షల మంది ‘తల్లికి వందనం’ ప్రయోజనాన్ని పొందే అర్హత కలిగిన వారిగా గుర్తించారు. ఈ పథకం అమలుకు దాదాపు రూ.10,300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
హాజరు నిబంధన
‘తల్లికి వందనం’ పథకాన్ని నిర్దేశిత విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.
బడ్జెట్‌పై ఆసక్తికరమైన చర్చ
ప్రభుత్వ హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, ప్రతి మహిళకు నెలకు రూ.1500 అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్పష్టత రానుంది.