అమరావతి: ముంబయి నటి కాదంబరి జెత్వాని అక్రమ అరెస్టు కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్‌కు సంబంధించి, రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ రిపోర్టులో విద్యాసాగర్‌తో పాటు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ తదితర ఐపీఎస్ అధికారులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు
రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న దాని ప్రకారం, కుక్కల విద్యాసాగర్‌తో ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ కలిసి ముంబయి నటి జెత్వాని అరెస్టులో కీలకంగా వ్యవహరించారనీ, నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ సృష్టించి, జెత్వాని పేరు వాడి అక్రమంగా అరెస్టు చేసినట్లు తెలిపారు.
జనవరి 30న కాంతి రాణా తాతా ఆదేశాల మేరకు ఈ కుట్ర ప్రారంభమైందని, ఫిబ్రవరి 1న ముంబయికి బయలుదేరిన పోలీసు బృందానికి కాంతి రాణా విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు రిపోర్టులో వివరించారు. కేసు ఫిబ్రవరి 2న నమోదు అయినప్పటికీ, టిక్కెట్లు ముందుగానే బుక్ చేయడం దీని వెనుక ఉన్న ముందస్తు ప్రణాళికను తెలియజేస్తుందని పోలీసులు నిర్ధారించారు.
కాదంబరి జెత్వాని అక్రమ అరెస్టు
ఫిబ్రవరి 3న నటి కాదంబరి జెత్వానిని, ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు ముంబయిలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ చర్యలు విద్యాసాగర్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారుల పరోక్ష సలహాతో జరిగినట్లు తెలుస్తోంది.
విద్యాసాగర్ రిమాండ్‌లో
ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను ఇటీవల కోర్టు 14 రోజుల రిమాండ్‌లో పంపించింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రానున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ప్రభుత్వాధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విద్యాసాగర్‌పై నాన్-బెయిలబుల్ సెక్షన్లు నమోదు కావడంతో, సంబంధిత ఐపీఎస్ అధికారులకు ఎదురుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాంతి రాణా
కాంతి రాణా తాతా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. రేపటి వరకు కాంతి రాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.