తెలంగాణ టీడీపీకి ఐదేళ్ల తర్వాత పునర్వైభవం దిశగా ప్రయాణం మొదలైంది. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో, గతంలో పార్టీకి దూరమైన కీలక నేతలు ఇప్పుడు తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల, హైద్రాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి వంటి కీలక నేతలు చంద్రబాబును కలుసుకుని, టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
తీగల కృష్ణారెడ్డి గతంలో టీడీపీ నేతగా హైద్రాబాద్ మేయర్‌గా పనిచేసిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. తాజాగా, ఆయన పార్టీకి తిరిగి చేరుతానని ప్రకటిస్తూ, టీడీపీ తనకు పుట్టినిల్లు వంటిదని పేర్కొన్నారు. మర్రి రాజశేఖర రెడ్డి, మల్లా రెడ్డి కూడా చంద్రబాబుతో చర్చలు జరిపి, త్వరలోనే పార్టీ మారే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఈ నేతలు, బీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశాలు, తెలంగాణ టీడీపీకి కొత్త శక్తి నింపనున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.