న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలో నెలకొన్న దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం అయిన కియా మోటార్ కంపెనీ తాజాగా తమ భారత విభాగం యొక్క పేరును అధికారికంగా మార్చినట్లు ప్రకటించింది.
ప్రస్తుతం వాడుకలో ఉన్న కియా మోటార్స్ పేరు, కియా ఇండియాగా మారినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటులో లోగో, పేరును ఇప్పటికే మార్చేసినట్లు, తరువాత దశలవారీగా డీలర్‌షిప్‌లలో కూడా దీనికి అనుగుంఅంగా పేరు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది.
కియా గత కొద్ది రోజుల క్రితమే తమ భారత కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. దాదాపు రెండేళ్ళ క్రితం భారత్‌లో అమ్మకాలు ప్రారంభించిన కియా మోటార్స్, భారత్ లో అత్యంత వేగంగా 2.5 లక్షల విక్రయాల మైలురాయిని దాటింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల కంపెనిల్లో నాలుగో కార్ల బ్రాండ్‌గా ఎదిగింది.