న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన కిరణ్ బేడీని పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.
కిరణ్ బేడీని తొలగించిన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. పూర్తిస్థాయిలో ఇంకొకరిని గవర్నర్ గా నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే ఎన్నికల్లో కిరణ్ బేడీపై ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం.