హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన బీజేపీ సంస్థాగత సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని ఆరోపించారు.
ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ, మహిళలు, యువత, రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఏడాది పాలన పూర్తి కావొస్తున్నప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి మాత్రమే ప్రత్యామ్నాయం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం అవుతుండగా, ప్రజల సమస్యలపై పోరాటం చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఇక దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల్లో కుటుంబ పాలన నడుస్తున్నా, బీజేపీలో మాత్రం కార్యకర్తలకు అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో అప్పులు పెంచి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.