స్పోర్ట్స్ డెస్క్: KKR vs DC: ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 204 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్లు గుర్బాజ్ (26) – నరైన్ (27) చురుకైన ఆరంభానిచ్చారు. ఆ తర్వాత రహానె (26), రింకు సింగ్ (36), రఘువంశీ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. చివర్లో రస్సెల్ (17) వేగంగా ఆడి కేకేఆర్‌ను 200కు మించిన స్కోరుకు చేర్చాడు.
దిల్లీ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యచేపటలో ఢిల్లీకి డుప్లెసిస్ (62), అక్షర్ (43), విప్రాజ్ (38) పోరాటం చేసినప్పటికీ, నరైన్ – వరుణ్ ల స్పిన్ దాడి ముందు తలవంచాల్సి వచ్చింది.
కేకేఆర్ బౌలింగ్‌లో నరైన్ 3 వికెట్లు, వరుణ్ 2, రస్సెల్, అనుకుల్, వైభవ్ చెరో వికెట్ తీశారు. 205 పరుగుల లక్ష్యానికి 190 పరుగుల వద్దే ఢిల్లీ ఆగిపోయింది. ఈ విజయంతో కోల్‌కతా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలోకి మళ్లీ దూసుకొచ్చింది.