స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానాన్ని ఎడమచేతి వాటం బౌలర్ చేతన్ సకారియా భర్తీ చేయనున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. 2024 ఐపీఎల్ మెగా వేలంలో ఎస్ఆర్‌హెచ్ అతడిని వదులుకోగా, కేకేఆర్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా ఈసారి అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
చేతన్ సకారియా ఇటీవలి ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. కానీ ఇప్పుడు కేకేఆర్ నుంచి అవకాశం రావడం అతనికి అదృష్టంగా మారింది. గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడిన అతడు 19 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
కేకేఆర్ జట్టులో ఇప్పటికే కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయాస్ అయ్యర్‌ను వదులుకుంది. అతడి స్థానంలో అజింక్య రహానే జట్టులోకి వచ్చాడు.
ఈ నెల 22న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.