తెలంగాణ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తామేమీ కూల్చాల్సిన అవసరం లేదని, ప్రజలే రోడ్లపైకి వచ్చి గద్దె దించేస్తారన్నారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే చరిత్ర తిరగరాస్తారని స్పష్టం చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం శోచనీయమని అన్నారు. విమర్శలు చేసిన దర్శనం వెంకటయ్య అనే దళితుడిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
హెచ్‌సీయూ భూముల కుంభకోణం పై కూడా కేటీఆర్ స్పందించారు. రూ. 10 వేల కోట్ల విలువైన స్కాం పై ఆర్బీఐతో పాటు సీబీఐ విచారణ జరపాలన్నారు. తన పాలనలో తప్పులైతే తనదే బాధ్యతనని స్పష్టం చేస్తూ, రేవంత్ రెడ్డి కూడా అదే స్పష్టత చూపాలన్నారు.
ప్రధాని మోదీ కూడా ఈ భూవివాదంపై ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. నిజంగా కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ జరగాలన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.