తెలంగాణ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ మిగులు బడ్జెట్‌తో ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల సంక్షేమానికి ఉపయోగించామని, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించామని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో రూ.125 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయితే ఆ నిధులు ఎక్కడికి పోయాయని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పులు చేసిన ప్రభుత్వం బీజేపీయే అని విమర్శించారు.
తాము చేసిన అప్పులు తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించామని, కానీ కేంద్రం కార్పొరేట్ శక్తుల రుణ మాఫీకి నిధులు వాడిందని ఆరోపించారు.
ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో తెలంగాణకు సరైన నిధులు కేటాయించలేదని, ప్రజలు ఈ అన్యాయాన్ని సహించబోరని స్పష్టం చేశారు.
14 మంది ప్రధానులు 65 ఏళ్లలో రూ.56 లక్షల కోట్ల అప్పులు చేయగా, బీజేపీ మాత్రం 10 ఏళ్లలోనే రూ.125 లక్షల కోట్లు అప్పు చేసింది అని కేటీఆర్ విమర్శించారు. అప్పులపై మాట్లాడే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదని తన లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడగా మారిందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను అందించకపోవడం అన్యాయం అని కేటీఆర్ లేఖలో వివరించారు. ఈ విషయంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.