హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని పేద ప్రజలకు పెద్ద శుభవార్త. డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో 1152 ఇళ్లను మంత్రి కే. తారకరామారావు సోమవారం ఈ పంపిణీ చేపట్టనున్నారు.
జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్‌లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్హత కలిగిన పేద ప్రజలకు మంత్రి ఈరోజు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను కూడా పేద ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన టీఆరెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది.
అయితే కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇళ్ల పంపిణీ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతల వారిగా ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.