సీఎం రేవంత్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడిన కేటీఆర్ అనేక ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లగచర్ల ఘర్షణ వివాదంపై సీఎం రేవంత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమ వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ (ఎక్స్)లో కేటీఆర్ ఈ విమర్శలను గుప్పించారు. ‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?’ అంటూ రేవంత్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కేటీఆర్ పోస్ట్‌లో, రేవంత్ రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం, రైతన్నల జీవితాలను నాశనం చేయడం వంటివి కుట్ర కాదా అని ఘాటుగా ప్రశ్నించారు. రైతులపై దాడులు చేయడం, ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించి కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం రేవంత్ కుట్ర కాదా అని ఆయన్ను నిలదీశారు.
ఈ వివాదంలో, లంబాడా రైతులను బెదిరించడం, రైతులపై చిత్రహింసలు పెట్టడం, ప్రజలను అసంతృప్తి పాలు చేయడమే రేవంత్ కుట్ర అని ఆరోపించారు. రూ. 50 లక్షల బ్యాగులతో దొరికిన వారికీ రైతు కష్టానికి ఉన్న విలువ తెలియదని కేటీఆర్ విమర్శించారు.
సోషల్ మీడియాలో తనను దోషిగా చిత్రీకరించేందుకు జరుగుతున్నా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నానని కేటీఆర్ తేల్చి చెప్పారు. ‘‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! జై తెలంగాణ,’’ అని కేటీఆర్ రేవంత్‌కి సవాల్ విసిరారు.