తెలంగాణ: కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలు హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడిపిస్తున్నారని ఆరోపించారు.
మూసీ ప్రాజెక్ట్ పేరిట పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. పెద్దలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తూ, పేదలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాలికొదిలేసి, ప్రశ్నించిన వారిపై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
రైతులకు భరోసా లేకుండా చేసారని, రుణమాఫీ కూడా జరుగడం లేదని విమర్శించారు. పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, 15 నెలల కాంగ్రెస్ పాలనలో నాశనమైందని అభిప్రాయపడ్డారు.
ఇది పాలన కాదు, పీడన అని, ఇది ప్రభుత్వం కాదు సర్కస్ కంపెనీ అని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు మేల్కొని, అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు.