తెలంగాణ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న వెంటనే, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ట్వీట్ చేస్తూ స్పందించారు. “నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యానుగానీ, అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు వచ్చినట్లు విన్నాను… ఇప్పుడే వణికితే ఎలా?” అంటూ ట్వీట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ విషయమై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఉదంతంపై స్పందించిన కేటీఆర్, “రైతులు కలెక్టర్‌పై తిరగబడ్డారని, ఇది పాలనా వైఫల్యానికి తాజా ఉదాహరణ” అని పేర్కొన్నారు.
ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి రాష్ట్రవ్యాప్తంగా పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని కేటీఆర్ తుగ్లక్ నిర్ణయం అని అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ రద్దుతో రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ భవితవ్యాన్ని ప్రమాదంలో పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొడంగల్ ప్రాంతంలో అన్నదాతల భూములు బలవంతంగా సేకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అది త్వరలోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.