ఉత్తరాంధ్ర: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదలైంది.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం, నాయకత్వ సమన్వయం కన్నబాబుకు ప్రధాన బాధ్యతలు కానున్నాయి. గతంలో సాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ గెలుచుకుంది. కానీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభావంతో పార్టీ ఓటమి పాలైంది.
అప్పుడు ఇంచార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలో సరైన దూకుడు కనిపించలేదని విమర్శలు వచ్చాయి. దాంతో, జగన్ తాజాగా కన్నబాబును పగ్గాలు చేపట్టమని నిర్ణయించారు.
కన్నబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కాపు వర్గం మెప్పు పొందడమే జగన్ లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు.
అయితే, మూడు జిల్లాల్లో ఉన్న రాజకీయ విభేదాలను సమర్థవంతంగా పరిష్కరించి, నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడమే కన్నబాబుకు కీలక పరీక్షగా మారనుంది.