ఢిల్లీ: లగచర్ల ఫార్మా పరిశ్రమ కోసం భూముల భూసేకరణపై చోటుచేసుకుంటున్న వివాదం మరింత ముదురుతోంది. భూముల కోసం ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, పోలీసుల చేత దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రైతులు, గిరిజనులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో వారు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
రైతులు మాట్లాడుతూ తమ భూములు ఫార్మా పరిశ్రమకు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. దాదాపు తొమ్మిది నెలలుగా ధర్నాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పలు సార్లు తమపై పోలీసులు దాడి చేసి అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అరెస్టు అయిన గ్రామస్థులను విడుదల చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు కూడా లగచర్ల సమస్యపై ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కలిశారు. ప్రభుత్వం గిరిజనుల భూములను ఫార్మా పరిశ్రమకు ఇవ్వడంపై మండిపడ్డారు.
గిరిజనుల భూములను కబ్జా చేసేందుకు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, విద్యుత్ కోసి ఇళ్లలోకి చొరబడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.