పంజాబ్: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వివాదం
పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనంగా మారిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూ వివాదంలో కీలక చర్యలు తీసుకున్నారు. కస్టడీలో ఉన్న బిష్ణోయ్‌ను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అనుమతించారని ఆరోపణలపై, పంజాబ్ పోలీసులు ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులతో సహా మొత్తం ఏడుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నిర్ధారించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
జైలు నుంచే ఇంటర్వ్యూలు
2023 మార్చిలో ప్రసారమైన లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూలపై తీవ్ర దుమారం రేగింది. సిట్ నివేదిక ప్రకారం, ఈ ఇంటర్వ్యూలు పంజాబ్ జైలు నుంచి వీడియో కాల్ ద్వారా జరిగినవని, మరోసారి జయపుర సెంట్రల్ జైలులో రికార్డు చేసినట్లు తేల్చారు. ఈ ఇంటర్వ్యూలు మీడియా ముందు రావడంతో పంజాబ్ హైకోర్టు సిట్‌ను నియమించి విచారణ జరిపించింది.
ఎడుగురి సస్పెన్షన్
బిష్ణోయ్ ఇంటర్వ్యూకు సహకరించిన కారణంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్‌లో ఉన్న గుర్షేర్ సింగ్, సమర్ వినీత్‌తో పాటు ఎస్‌ఐలు రీనా, జగపాల్ జంగూ, షాగింత్ సింగ్, ఏఎస్ఐ ముక్తియార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్ లపై సస్పెన్షన్ వేటు పడింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులపై తక్షణ చర్యలు తీసుకున్నట్లు పంజాబ్ హోం సెక్రటరీ ప్రకటించారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో ప్రసారమైన బిష్ణోయ్ ఇంటర్వ్యూను 2022 సెప్టెంబర్ 3న అర్ధరాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీశారని వెల్లడించారు.
జైలు నుంచే హత్యల ప్రణాళికలు
లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే జైల్లో నుంచే అనేక క్రిమినల్ కుట్రలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా మొబైల్ ఫోన్ల ద్వారా తన అనుచరులతో టచ్‌లో ఉంటూ ప్రముఖ వ్యక్తులపై దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే జరిగినట్లు వివరించారు.
సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ అనేకసార్లు బెదిరింపులు చేసింది. 2023 నవంబరులో ‘మరణానికి వీసా అవసరం లేదు’ అంటూ బెదిరింపు హెచ్చరిక పంపింది. 2018లో కృష్ణ జింకల వేట కేసు విషయంలో సల్మాన్ మాటలు తమ మనోభావాలను దెబ్బతీశాయని బిష్ణోయ్ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై సల్మాన్‌కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు.