ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ మాఫీయా నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కొత్త మద్యం పాలసీలు ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా తీసుకువచ్చారని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మద్యం బ్రాండ్ల పేరుతో తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు:
“దోచుకో, పంచుకో, తినుకో” మాత్రమే చంద్రబాబు పాలనలో కనిపిస్తోందని జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అన్నీ అబద్ధాలని, ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ కూటమి ఉందని, ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం దారుణమని అన్నారు.
మద్యం పాలసీపై విమర్శలు:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ పెద్ద స్కామ్‌లతో నిండిపోయిందని జగన్ తెలిపారు. మద్యం షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించారని, దీనికి నేతలే బాసటగా ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు మద్యం, ఇసుక స్కాంలను డైవర్ట్ చేయడంలో నిష్ణాతుడని చెప్పారు.
సీమెన్స్ ప్రాజెక్ట్, స్కిల్ స్కామ్:
సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు 13 సంతకాలు చేశారని, ఈ ప్రాజెక్ట్‌లో రూ. 371 కోట్ల నిధులు దారి మళ్లించారని జగన్ తెలిపారు. స్కిల్ స్కామ్ కేసులో ఈడీ చంద్రబాబు ఆస్తులను అటాచ్ చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఇసుక స్కామ్:
ఇసుక ధరలు గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయని, బీజేపీతో కలిసి దోపిడీ జరిపారని జగన్ విమర్శించారు. “ఉచిత ఇసుక అని చెబుతున్నా, ఇసుక ధరలు విపరీతంగా పెరిగాయి” అని తెలిపారు. లారీ ఇసుక ధరలు కొన్ని నియోజకవర్గాల్లో రూ. 20 వేల నుంచి 30 వేల వరకు ఉంటున్నాయని అన్నారు.
క్లబ్‌లు, పేకాట కేంద్రాలు:
ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, ఇసుక దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, సీఎం, ఎమ్మెల్యేలకు కప్పం కట్టకుండా ఏ పని జరగడం లేదని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు ఇస్తూ ప్రజల ఆశలను చెలగాటం ఆడుతున్నారని అన్నారు.