
టాలీవుడ్:
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన తెలుగు సినిమా పాట రాయడం సినిమా చేసుకున్న అదృష్టం,
ఒక సినిమా అభిమానిగా చెప్పాలంటే ఆయన రాసిన పాటలు వినడం, ఆస్వాదించడం మనందరం చేసుకున్న అదృష్టం.
అలాంటి గొప్ప రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఒక పోస్ట్ రాయడం కూడా నా అదృష్టం అని భావిస్తున్నా.
కెరీర్ ప్రారంభం లోనే తాను కొన్ని రకాల పాటలు రాయనని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తాను రాసే పాటల్లో అర్ధం పర్థం లేని పదాలు ఉండవు. శృంగార భరిత పాటలు సీతారామ శాస్ట్రీ గారి కలం నుండి వచ్చినట్టు ఆనవాళ్లు కూడా లేవు. తాను రాసే డ్యూయెట్ పాటల్లో కూడా ఎంతో కొంత మంచి చెప్పడం ఆయన ప్రత్యేకత. ఖడ్గం సినిమాలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ లాంటి పాటలో కూడా మంచి పదాలతో జీవిత సారం చెప్పగలిగిన మహానుభావుడు సీతారామశాస్త్రి అని చెప్పవచ్చు.
1986 లో సిరివెన్నెల సినిమాలో ‘విధాత తలపున’ పాట నుండి 2020 లో వచ్చిన జాను సినిమాలో లో ‘లైఫ్ అఫ్ రామ్’ పాట వరకు ఆయన కలం నుండి వచ్చిన ప్రతీ పాట ఒక అద్భుతం. గమ్యం సినిమాలో ‘ఎంత వరకు ఎందుకొరకు వింత పరుగు’ అన్నా, గాయం సినిమాలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవత్సవాన్ని’ అన్నా కూడా ఆయన పాటలు ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి. ఒక సినిమా కోసం రాసే పాటలా కాకుండా అది విన్న వారు ఎంతో కొంత ఆలోచించగలిగేలా రాయడం సీతారామశాస్త్రి గారి ప్రత్యేకత.
ఆయన రాసిన పాటల్లోని గొప్ప గొప్ప మాటలన్నీ ఒక పోస్ట్ లో పెడదామంటే ఒక దాన్ని మించి మరొకటి కనిపిస్తుంది. అలా రాసుకుంటూ పోతే ఎన్ని పోస్ట్ లు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాల సినీ గేయ రచయిత అనుభవం లో పది కి పైగా నంది అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు కొన్ని కోట్ల హృదయాల్ని తాకగలిగారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సీతారామశాస్త్రి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకొన్ని దశాబ్దాలు ఆయన పాటల ద్వారా తెలుగు బాష , తెలుగు సినిమా సాహిత్యం గొప్ప స్థాయిలో నిలబడాలని ఆశిస్తూ
— ఒక సినిమా అభిమాని , తెలుగు భాషాభిమాని