అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేసింది.
మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో ఆంధ్రలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా ప్రస్తుతం 26,622 యాక్టివ్ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్‌లకు కోవిడ్ సోకిందని సీఎస్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్‌కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.
మరోవైపు నవంబర్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలు కానుందనే భయాందోళనలున్నాయి. ఈ సమయంలో తక్షణమే ఎన్నికలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్తిథి నెలకొనే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.