న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో అజయ్ కుమార్ కుర్తా–పైజామా ధరించి భుజాన గడ్డపారా వేసుకొని దర్జాగా పచ్చటి పొలాల గుండా వెళుతున్నారు. తన భవిష్యత్తు పట్ల గత కొన్ని నెలలుగా నెలొకన్న అనిశ్చిత పరిస్థితులు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయనలో కొత్త ఆశ, కొత్త ఆనందం చిగురిస్తున్నాయి. ఈసారి వర్షాలు కూడా బాగా కురవడంతో పంటలు బాగా పండుతాయని ఆయన ఆశిస్తున్నారు.
హమీర్‌పూర్ జిల్లాలోని తన స్వగ్రామానికి తిరిగి రావడానికి కొన్ని నెలల మందు అజయ్ కుమార్ నోయిడాలోని గేటెడ్ అపార్ట్‌మెంట్ సొసైటీలో ఉద్యోగం చేసేవారు. అక్కడే నగర శివారులో ఓ చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే జీవించాలని కోరుకున్నారు. అనూహ్యంగా ప్రాణాంతక కోవిడ్ మహమ్మారి దాడి చేయడంతో ఆయన ఉద్యోగం పోయింది. దాంతో ఆయన కన్న కలలన్నీ ఛిద్రం అయ్యాయి.
అంతే నోయిడాలో తాను అద్దెకుంటోన్న ఇల్లును ఖాళీ చేసి తన అల్లుళ్లతో కలిసి సొంతూరు బాట పట్టారు. ఊరొచ్చాక కూడా ఏం చేయాలో తోచక తమ పూర్వికుల నుంచి సంక్రమించి పొలాలను చదును చేశారు. చమురు విత్తనాలతోపాటు పలు రకాల పప్పు దినుసుల విత్తనాలను తీసుకొచ్చి నాటారు.
అజయ్ కుమార్ లాగే చంద్రగోపాల్ అహిర్వాల్ మధ్యప్రదేశ్‌లోని తార్‌పూర్‌లోని జిల్లాలోని తనూరు ఖరేహాకు వెళ్లారు. ఊళ్లో కూడా ఉద్యోగాలు లేక వ్యవసాయంపై తన దృష్టిని కేంద్రీకరించారు. ‘ఏ దిక్కు కానరానప్పుడు తల్లి వొడికి చేరినట్లు సొంతూరుకు వెళతాం. అన్ని వేళల తల్లే ఆదరిస్తుంది’ చంద్రగోపాల్ మీడియాతో వ్యాఖ్యానించారు. అహిర్వార్, ఆయన భార్య రాజ్‌రాణి, తన అన్న జైరామ్, వదిన గౌరి ఢిల్లీలో దినసరి కూలీలుగా పనిచేస్తూ బతుకుతుండగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ వచ్చింది. ఉపాధి పోయింది.
దాంతో పూట గడవడమే కష్టమై అందరు కలిసి ఊరు బాట పట్టారు. మళ్లీ తమ పొలాల్లోకి వచ్చి పని చేసుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వానలు సరిగ్గా కురవక వ్యవసాయాన్ని వదిలేసి వలస పోయిన చిన్న, సన్నకారు రైతులు తిరిగి రావడం, వారికి సానుకూలంగా వర్షాలు కురవడంతో ఈసారి అన్ని పంటల సాగు బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.