ఏపీ: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మాటల తూటాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాల్లో ప్రతిపక్ష మీడియాను టార్గెట్ చేస్తూ చేసే వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ పద్ధతిని ఇప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా అనుసరించారు.
లోకేశ్ మీడియా సమావేశాల్లో సాక్షి, ఎన్టీవీ ప్రతినిధులను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టడం కామన్‌గా మారిపోయింది. దీంతో ఈ మీడియా సంస్థల జర్నలిస్టులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా ఇదే స్టైల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
తన ప్రెస్ మీట్‌లో “టీవీ5 వచ్చిందా? ఆంధ్రజ్యోతి వచ్చిందా? వచ్చినట్లయితే నేను మాట్లాడొచ్చు” అంటూ వ్యాఖ్యానించారు. అంబటి మాటలకు అక్కడున్న మీడియా మిత్రులు, అనుచరులు ముసిముసిగా నవ్వుకున్నారు.
రాజకీయ నాయకులు ఇలా ప్రత్యర్థుల స్టైల్స్‌ను అనుసరించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది.