కోలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు? అని అడిగితే మొదట వినిపించే పేరు లోకేష్ కనగరాజ్. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో ఇండియన్ సినిమా టేకింగ్‌కు కొత్త దిశ చూపిన లోకేష్… ఇప్పుడు మరో భారీ అడుగు వేశాడు.
కన్నడలోని కేవీఎన్ ప్రొడక్షన్స్ తో మూడు సినిమాల భారీ డీల్‌కి సైన్ చేశారని ఫిలింనగర్ బజ్. ఈ డీల్ ప్రకారం మూడు సినిమాలు వరుసగా ప్లాన్ చేయబోతున్నారని, తక్కువ గ్యాప్‌తో సెట్స్ పైకి వెళ్లేలా లైన్ ఫిక్స్ అవుతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ స్పీడ్‌గా పాకుతోంది.
గతంలో ప్రభాస్-హోంబలే డీల్ తరహాలోనే ఇది మరొక భారీ కాంబినేషన్‌గా నిలవనుందని ట్రేడ్ పండితుల అంచనా. ఇక ఈ ప్రాజెక్ట్స్‌లో ఒక్కటి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్తో ఉంటుందని ప్రచారం హైలైట్‌గా మారింది.
‘RC16’, ‘RC17’ తర్వాత ‘RC18’ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఉండబోతుందని సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇది ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe) లో భాగమా? లేక కొత్త కాన్సెప్ట్‌తోనా అన్నది త్వరలోనే స్పష్టత రానుంది.
మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి కార్తీతో ‘ఖైదీ 2’, మరొకటి సూర్య ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రోలెక్స్’ కావొచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ‘విక్రమ్’లో సూర్య చేసిన చిన్న క్యారెక్టర్‌నే అంత హైప్ పొందిన సంగతి తెలిసిందే.
ఈ ముగ్గురు స్టార్స్‌తో లోకేష్ – కేవీఎన్ డీల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా, చరణ్ – లోకేష్ కాంబోపై మెగా ఫ్యాన్స్ ఇప్పటికే హైప్ బిల్డ్ చేసేశారు.