కడప: టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ తన మాట నిలబెట్టుకున్నాడు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో అటవీ శాఖ తొలగించిన శ్రీ కాశినాయన అన్నదాన సత్రాన్ని తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చిన లోకేశ్, వెంటనే పనులు ప్రారంభించాడు.
టైగర్ రిజర్వ్ జోన్‌లో ఉందంటూ అటవీ శాఖ అధికారులు కొన్ని భవనాలను తొలగించారు. దీంతో వేలాది మంది భక్తులకు సేవలు అందించే సత్రాన్ని నష్టపరిచారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోకేశ్ హామీ ఇచ్చిన వెంటనే, తన బృందాన్ని రంగంలోకి దించి పునర్నిర్మాణ పనులను ప్రారంభించాడు.
బుధవారం రాత్రికే లోకేశ్ ప్రత్యేక బృందాన్ని బద్వేలు పంపించి, గురువారం ఉదయానికి భవనాల నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేశారు. మధ్యాహ్నానికి మట్టి తవ్వకాలు ప్రారంభమవగా, నిర్మాణాలు వేగంగా కొనసాగనున్నాయి.
అతికొద్ది సమయంలోనే పనులు ప్రారంభించడం, లోకేశ్ తన హామీ నిలబెట్టుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన పనులను తక్షణమే పూర్తి చేయాలనే ఆయన నిబద్ధత ప్రశంసలందుకుంటోంది.