అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు – ఏపీ డీజీపీ వెల్లడి
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి, ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ధారించారు. బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జలను, ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ, ఆయనను కొంత సేపు అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లేందుకు అనుమతించారని సమాచారం. కానీ, అప్పటికే హైదరాబాద్ విమానం టేకాఫ్ కావడంతో, సజ్జల మరో విమానానికి వేచి చూడాల్సి వచ్చింది.
డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, గతంలో గుంటూరు ఎస్పీ సజ్జలపై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినట్లు వెల్లడించారు. సజ్జలను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడతాయని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, గన్నవరంలో జరిగిన దాడి కేసులు సీఐడీకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇక కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు గురించి స్పందిస్తూ, ఆ విచారణపై సుప్రీం కోర్టు అనుమానాలు వ్యక్తం చేయలేదని, స్వతంత్ర విచారణ జరగాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ అన్నారు. ఈ సిట్‌లో ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నుంచి ఒక అధికారి ఉన్నారు.
సజ్జలతో పాటు, వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయబడినట్లు సమాచారం. వీరిపై టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఉన్నాయి.