fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshతూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Low pressure over East Central Bay of Bengal

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత బుధవారం నాటికి ఇది తుపానుగా మారే సూచనలు ఉన్నాయి.

వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ అక్టోబర్ 24న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్టోబర్ 24, 25 తేదీల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అలాగే, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.

ఇక బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో అక్టోబర్ 23, 24 తేదీల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ శాఖ 22 నుంచి 25 వరకు మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని సూచనలిచ్చింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని పేర్కొంది.

అదే సమయంలో, విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ, తుపాను ప్రభావం కోస్తాంధ్రను అక్టోబర్ 24, 25 తేదీల్లో తాకే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

“తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ రేపటికి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అది 23వ తేదీకి తుపానుగా బలపడే అవకాశం కూడా ఉంది. ఒడిశా-బంగాల్‌ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతానికి తుపాను చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కూడా రావచ్చు. తుపాను దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్తున్నాము. అదే విధంగా ఎవరైతే ఇప్పటికే వెళ్లారో వారిని వారందరినీ వెనక్కి రావాలని కోరుతున్నాం. అదే విధంగా ఒడిశా ప్రాంతంవైపు కూడా ఎవరినీ వేటకు వెళ్లొద్దని చెప్తున్నాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24 నుంచి గంటకు 100 కిలీమీటర్లు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది”. – KVS శ్రీనివాస్, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి

తుపానుపై కేంద్రం స్పందన
బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కార్యదర్శులు, డిఫెన్స్, డిజి ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, డిజి ఐఎండి పాల్గొన్నారు. ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో తీసుకున్న ముందస్తు చర్యలపై వివరించారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసి, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించినట్లు తెలిపారు. ప్రజల కోసం అత్యవసర సహాయ శిబిరాలు, సురక్షిత ప్రాంతాల ఏర్పాటు జరిగిందని, విద్యుత్‌ సమస్యల కోసం పునరుద్ధరణ బృందాలను సిద్ధం చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular