న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కరోనా దెబ్బ నుండీ బయట పడుత్న్న సామాన్యుడి నడ్డి మళ్ళీ విరుస్తోంది. ఇప్పటికే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి.
ఇప్పటికే భారత్ లో నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటాలు పడుతుంటే తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు పెరిగి మరొక షాకిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ రోజు అయిన ఫిబ్రవరి 1న వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సిలిండర్ కూడా గుదిబండగా తయారయింది.
ఈ రోజు చమురు సంస్థలు విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉండేది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ. 719కి పెరిగింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది.