అమరావతి: ఏపీకి ‘లులు’ పునరాగమనం
గతంలో అప్పటి సీఎం జగన్ ప్రభుత్వం తీరుతో అసంతృప్తి చెందిన లులు గ్రూప్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ తన బృందంతో కలిసి అమరావతిలో సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఈ భేటీ సందర్భంగా, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, అలాగే విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్ నిర్మాణంపై ఆసక్తి చూపారు.
చంద్రబాబు స్వాగతం
లులు గ్రూప్ బృందానికి సీఎం చంద్రబాబు సాదరంగా స్వాగతం పలకడమే కాకుండా, ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడంపై ప్రోత్సాహం చూపారు. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలకు తాము అనుకూలత కల్పిస్తామని వివరించారు. ఇదే సమయంలో గత టీడీపీ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి విషయాలను చర్చించారు.
జగన్ హయాంలో విడిపోయిన లులు గ్రూప్
2018లో రూ. 2,200 కోట్లతో విశాఖలో పెట్టుబడి చేసే ఉద్దేశంతో లులు గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపుల్లో అవకతవకల పేరుతో ఒప్పందం రద్దు చేయడం జరిగింది. దీని కారణంగా లులు గ్రూప్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు పెట్టడమే కాకుండా, అక్కడి ప్రభుత్వాలతో అనుసంధానం ఏర్పరచుకుంది.
నూతన పాలసీలతో పెట్టుబడులకు ప్రోత్సాహం
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, లులు గ్రూప్ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది. సులభతర వ్యాపార వాతావరణం, వేగవంతమైన పరిపాలన లక్ష్యంగా రాష్ట్రం తీసుకువస్తున్న నూతన పారిశ్రామిక పాలసీలు చర్చకు వడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడుల కోసం తీసుకుంటున్న చర్యలను బృందం ప్రశంసించింది.