చెన్నై: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో AR డెయిరీకి మద్రాస్ హైకోర్టు న్యాయస్థానం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. AR డెయిరీకి మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేయాలని సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే షోకాజ్ నోటీసుపై స్పందించేందుకు AR డెయిరీకి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అస్పష్టమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. హైకోర్టు అధికారుల జారీ చేసిన నోటీసుల్లో ఉన్న అస్పష్టతను ప్రస్తావిస్తూ, నిబంధన ఉల్లంఘనలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది.
AR డెయిరీ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ ఈ వివాదం రాజకీయాలకు దూరంగా ఉంచి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సూచించింది.
కేసు నేపథ్యం
AR డెయిరీ, తమిళనాడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేస్తుంది. జూన్ 4, 6, 19, 27 తేదీల్లో పంపించిన నెయ్యి ట్యాంకర్లు, TTD ప్రయోగశాలలో క్లియరెన్స్ తర్వాత మాత్రమే సరఫరా జరిగిందని AR డెయిరీ పేర్కొంది. ఈ నేపథ్యంలో, TTD మూడు ట్యాంకర్లకు చెల్లింపులు కూడా చేసింది. కానీ జులై 3, 4, 9 తేదీల్లో పంపిన మరో నాలుగు ట్యాంకర్లను టిటిడి తిరస్కరించడమే కాకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
AR డెయిరీ వాదన ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ – 2006 ప్రకారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ద్వారా ఫిర్యాదు పరిష్కారం చేయవలసి ఉన్నప్పటికీ, టీటీడీ గుజరాత్‌లోని NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుందని తెలిపింది.