ముంబై: దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే అధికంగా కేసులు నమోదు జరగడం తెలిసిందే. అలాగే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఇవాల లక్ష దాటింది. ఆదివారం మరణించిన 233 మందితో కలిపి కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 1,00,130 మంది మృతిచెందారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 12,557 మంది కరోనా వైరస్ బారిన పడటంతో రాష్ట్రం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,31,781ను తాకింది. అదే సమయంలో 14,433 మంది కరోనా నుండి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 55,43,267కు పెరిగింది.
అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 95.05 శాతంకు చేరింది, మరణాల రేటు 1.72 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,85,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో చేసిన 2,37,514 పరీక్షలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,65,08,967 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో తాజాగా 786 కేసులు మరియు 20 మరణాలు నమోదయ్యాయి. ముంబై డివిజన్‌లో తాజాగా 2,420 మంది కరోనా బారిన పడగా 33 మంది మృతిచెందారు. నాసిక్ డివిజన్‌లో 1,194, పుణే డివిజన్‌లో 2,999, కొల్హాపూర్ డివిజన్‌లో 3,864, ఔరంగాబాద్ డివిజన్‌లో 373, లాతూర్ డివిజన్‌లో 570, అకోలా డివిజన్‌లో 718, నాగ్‌పూర్ డివిజన్‌లో 419 కేసులు నమోదయ్యాయి.