ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల తొలి మరణం నమోదవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్‌వేవ్ ఆందోళనలలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి ఉంచి, వీలైనంత ఎక్కువ మందికి టీకా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. దానితో పాటు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచనున్నట్లు పేర్కొంది.
అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం పుణె, థానేల్లో పాలనా విభాగాల్లో లెవల్ 3 నిబంధనలు అమల్లో ఉంటాయని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో తిరగడానికి అనుమతి ఉంటుందని, అయితే, సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని ప్రకటించింది.
అలాగే ఆర్టీ- పీసీఆర్ పరీక్ష ఫలితాలనే ఆధారంగానే చేసుకుని పాజిటివిటీ రేటును అంచనా వేయనున్నట్లు, రాపిడ్ యాంటీజెన్ టెస్టులతో అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా, డెల్టా ప్లస్ వేరియంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకరమైన వేరియంట్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో మూడో స్థాయి నిబంధనలు అమల్లో ఉంటాయని, రాష్ట్రంలోని అర్హులైన 70 శాతం మందికి టీకా వేయించడం తమ లక్ష్యమని తెలిపింది. కాగా రత్నగిరి, జలగాం సహా ఇతర జిల్లాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూసాయి.
ఈ క్రమంలో రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు నమోదు కాగా దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.