ముంబై : మొదట్లోనే మహారాష్ట్రను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు అక్కడ మళ్ళీ చెలరేగుతోంది. దాని వల్ల ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఇన్‌చార్జ్ రాజేష్ తోపేతో సహా మంత్రులు జయంత్ పాటిల్, రక్షా ఖాడ్సే, రాజేంద్ర షింగ్నేలతో పాటు మరి కొందరు నేతలు కరోనా బారిన పడ్డారు.
ఇదిలా ఉండగా మంత్రి ఓంప్రకాష్ బాబారావు తనకు రెండోసారి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ మధ్యకాలంలో తనని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మంత్రి జయంత్ ఆర్ పాటిల్ సైతం తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు.
ఈయన ఇటీవలె శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో పాల్గొనడంతో మిగతా కేబినెట్ సభ్యులకు కరోనా భయం పట్టుకుంది. ఇటీవలి కాలంలో ప్రజల్లో కరోనా పట్ల పెద్దగా భయం లేకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో కోవిడ్ మళ్లీ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు. కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామన్న భావన ప్రజల్లో నెలకొందని, ఫలితంగా కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరించిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతిరోజూ 3,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. తొలివారంతో పోలిస్తే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి 3వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 4787 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, గురువారం 5వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.