ఆంధ్రప్రదేశ్: రాయలసీమ రహదారులకు మహర్దశ
ఏడు కీలక జాతీయ హైవే ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
6 వేల 280 కోట్ల రూపాయలతో 7 జాతీయ రహదారుల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా వ్యవస్థ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. భారతమాల పరియోజన ప్రాజెక్ట్ (Bharatmala Pariyojana) మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్‌కి మంజూరైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ పచ్చజెండా ఊపింది. మొత్తం 6,280 కోట్ల రూపాయల వ్యయంతో 384 కిలోమీటర్ల మేర ఈ రహదారులను విస్తరించనున్నారు.
గతంలో ఈ ప్రాజెక్టులు మంజూరైనప్పటికీ టెండర్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. తాజాగా కేంద్రం ఏకకాలంలో ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతి ఇచ్చింది. దీనితో, రహదారుల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
7 జాతీయ రహదారుల వివరాలు:
- NH 167AG: 49.917 కిలోమీటర్ల మార్గాన్ని 881.61 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.
- NH 167K: సంగమేశ్వరం-నల్లకాలువ మధ్య 62.571 కిలోమీటర్ల మార్గాన్ని 601 కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరుసలుగా విస్తరిస్తారు.
- NH 167K నంద్యాల-కర్నూలు/కడప బోర్డర్ సెక్షన్: 62 కిలోమీటర్ల మేర ఆధునికీకరణ కోసం 691 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు.
- NH 440: వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు 78.95 కిలోమీటర్ల రహదారిని 1,321 కోట్ల రూపాయలతో విస్తరిస్తారు.
- NH 716G ముద్దనూరు-హిందూపురం సెక్షన్: 33.58 కిలోమీటర్ల మార్గాన్ని 808 కోట్ల రూపాయలతో విస్తరించనున్నారు.
- NH 716G ముద్దనూరు-బి.కొత్తపల్లి సెక్షన్: 56.5 కిలోమీటర్ల రహదారి విస్తరణకు 1,019.97 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి.
- NH 516B పెందుర్తి-ఎస్.కోట సెక్షన్: 40.5 కిలోమీటర్ల రహదారిని 956.21 కోట్ల రూపాయలతో విస్తరిస్తారు.
ఈ ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ మేరకు లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ, కొండమోడు-పేరేచెర్ల రహదారి విస్తరణలో భాగంగా సత్తెనపల్లి, మేడికొండూరుల వద్ద రెండు బైపాస్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.