టాలీవుడ్: నిన్న ప్రకటించిన 67 వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల్లో మహర్షి మరియు జెర్సీ సినిమాల్లో కొన్ని క్యాటగిరిలో ఉత్తమ అవార్డులు గెలుపొందాయి. ఒకప్పుడు ఎపుడో ఒకసారి తెలుగు సినిమాలకి జాతీయ గుర్తింపు లభించేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా నుండి అవార్డులు లభిస్తున్నాయి. ఈసారి ఏకంగా ఐదు కాటగిరీలలో అవార్డులు పొందడం విశేషం. సౌత్ లో కేవలం మళయాళం, తమిళ్ సినిమాలే జాతీయ అవార్డులు ఎక్కువ గెలుస్తాయి, ఇప్పటి నుండి తెలుగు కూడా ఆ లిస్ట్ లో జత చేరబోతోంది.
జెర్సీ సినిమాకి ఎడిటింగ్ అందించిన నవీన్ నూలి కి జాతీయ స్థాయిలో ఉత్తమ ఎడిటర్ గా అవార్డు లభించింది. దీనితో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ సినిమాకి అవార్డు లభించింది. మహర్షి సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. ఉత్తమ నిర్మాణ సంస్థ గా మహర్షి సినిమాని రూపొందించిన దిల్ రాజు వారి శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ కి అవార్డు లభించింది. ఉత్తమ కొరియోగ్రఫీ గా మహర్షి సినిమాకి రాజు సుందరం కి అవార్డు లభించింది. వీటితో పటు జెర్సీ సినిమాలో నాని నటనకి స్పెషల్ జ్యూరీ అయినా ఇవ్వాల్సింది అని సినిమా అభిమానులు కొంచెం నిరాశ చెందారు కానీ మొత్తంగా చూసుకుంటే తెలుగు సినిమాలు కూడా జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం శుభ సూచకం.