టాలీవుడ్: కరోనా తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కోలుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. క్రాక్, ఉప్పెన లాంటి సినిమా సక్సెస్ లే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వాటి తర్వాత వచ్చే వారం మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవి పేరుకు చిన్న సినిమాలే అయినా ఇండస్ట్రీ నుండి పెద్దల సపోర్ట్ తో ప్రొమోషన్ లో దూకుడు చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఒక హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమా హీరో, ఆ సినిమా టెక్నిషియన్ టీం మాత్రమే ప్రమోట్ చేసేవారు. ఇపుడు తోటి హీరోలందరూ ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రొమోషన్ లో స్పీడ్ పెంచి సినిమా మైలేజ్ పెంచుతున్నారు.
శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘శ్రీకారం‘ సినిమా ఈ వారం విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ముగ్గురు హీరోలతో విడుదల చేయించారు. అంతే కాకుండా ట్రైలర్ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం మెగా స్టార్ చిరంజీవిని ఒప్పించి తన స్నేహితుడి సినిమా ప్రొమోషన్ ని ఆకాశానికెత్తాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి హీరోగా ‘జాతి రత్నాలు’ అనే సినిమా ఈ వారమే విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేయించి ప్రొమోషన్ చేస్తున్నారు మూవీ టీం. ఈ దెబ్బతో ఈ సినిమా టాక్ అఫ్ టాలీవుడ్ గా నిలిచింది. ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో టాప్ 1 పొజిషన్ లో ఉంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకి విజయ్ దేవరకొండ వచ్చి ఈ సినిమా ప్రొమోషన్ ని మరో మెట్టు ఎక్కించనున్నారు.
వీటితో పాటు శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘గాలి సంపత్’ కూడా ఈ వారం విడుదల అవుతుంది. ఈ సినిమా వేడుకకి రామ్ పోతినేని ముఖ్య అతిధి గా వచ్చి సినిమా కి ప్రొమోషన్ చేయనున్నారు. ఇలా ఒక హీరో వేరే హీరోల సినిమాకి ప్రమోట్ చేస్తూ సినిమా రీచ్ ని పెంచుతూ అన్ని సినిమాలు మంచిగా ఆడాలని తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ ఇండస్ట్రీ ఎక్కువ హిట్లతో కళకళలాడడానికి తమ వంతు కృషి చేస్తూ ఉండడం సంతోషాన్నిస్తుంది.