తెలంగాణ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, గాంధీ భవన్‌లో ప్రత్యేక పూజలతో పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ముందుగా మహేశ్ గౌడ్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షితో భారీ ర్యాలీగా గాంధీ భవన్ చేరుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి, బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, “బడుగు, బలహీన వర్గాలకు గౌరవం కల్పిస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తా,” అని పేర్కొన్నారు.
దీని పట్ల ఏఐసీసీ సెక్రటరీ జనరల్ దీపాదాస్ మున్షి హర్షం వ్యక్తం చేస్తూ, “మహేశ్ గౌడ్ తక్కువ స్థాయి నుంచి ఎదిగి ఈ స్థాయికి రావడం కాంగ్రెస్‌లో కష్టపడిన వారికి గౌరవం దక్కుతుందనే సంకేతం” అని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నో కేసులు ఎదురైనా, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మహేశ్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది,” అని అభినందించారు.
ఇటువంటి నేతలకు పగ్గాలు ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వానికి కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.