హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి ఊహించని నోటీసులు అందాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్ట్‌లో ప్రమోషన్ చేసినందుకు సంబంధించిన రుణ లావాదేవీలపై ఈడీ విచారణ ప్రారంభించింది.
ఈ కేసులో మహేశ్ ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గత వారం సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఈ సంస్థల నుంచి మహేశ్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో రూ.3.4 కోట్లు నగదు, మరో రూ.2.5 కోట్లు ఆర్‌జీఎస్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లించారని తెలుస్తోంది.
మహేశ్ తన కుటుంబంతో కలిసి ఈ సంస్థ యాడ్‌లో నటించారు. ఈ ప్రకటన చూసిన చాలా మంది పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తెలుస్తోంది. కానీ అనుమతులు లేని లేఅవుట్ల విక్రయం, ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఒకే ప్లాట్‌ను పలువురికి అమ్మినట్లు కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించి మోసపూరిత లావాదేవీలపై మరింత సమాచారం సేకరిస్తోంది.
మహేశ్ బాబు నేరంగా ప్రమేయం లేకపోయినా.. ఆయనకు చెల్లించిన నగదు వ్యవహారంపై ఈడీ వివరణ కోరనుంది. విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.