టాలీవుడ్: వరుసగా థ్రిల్లర్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్న అడవి శేష్ ఈసారి ఒక ఆర్మీ మేజర్ కథని బేస్ చేసుకుని సినిమాని చేస్తున్నాడు. ఆర్మీ మేజర్ గా పని చేసి ముంబై అటాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు అడవి శేష్. గూఢచారి సినిమాకి దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ , సోనీ పిక్చర్స్, A ప్లస్ S మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ ని తెలుగు లో మహేష్ బాబు, హిందీ లో సల్మాన్ ఖాన్, మలయాళం లో పృథ్విరాజ్ సుకుమారన్ విడుదల చేసారు.
ఫస్ట్ షాట్ నుండే ఆకట్టుకుంది ఈ సినిమా టీజర్. శరీరం లో బుల్లెట్స్ దిగి రక్తం కారుతుండగా ‘సైనికుడిగా ఉండడం అంటే ఏంటి’ అనే అడవి శేష్ డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. మొదటి సీన్లోనే తీవ్రవాదులతో పోరాడే కొన్ని సీన్స్ తో అబ్బురపరిచారు. ఈ సీన్స్ లో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అడవి శేష్ ఎక్సప్రెషన్స్, శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలవనున్నట్టు టీజర్ ద్వారా అర్ధం అవుతుంది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో శోభిత ధూళిపాళ్ల, శాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ నటిస్తున్నారు.
‘బోర్డర్ లో ఆర్మీ ఎలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా గెలవాలి అని అందరూ ఆలోచిస్తారు, అదీ దేశ భక్తే, దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడటం సోల్జర్ పని’ అంటూ శేష్ చెప్పే డైలాగ్స్ తో అబ్బూరి రవి మాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే అడవి శేష్ అందించడం విశేషం. జులై 2 న ఈ సినిమాని తెలుగు, హిందీ , మలయాళం లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.