హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఖర్చుచేసిన రూ.16.70 లక్షల కోట్ల నిధులపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో కీలక ప్రశ్నలు హైలెట్ చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన భట్టి, ఈ మొత్తంతో ఏ ప్రాజెక్టులు పూర్తయ్యాయో, ఏ అభివృద్ధి సాధించారో వివరించాలని డిమాండ్ చేశారు.
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులెన్నింటినైనా నిర్మించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరికి అది కూడా కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి రూ.77 వేల కోట్ల బకాయిలు పెడితే అది అభివృద్ధి ఎలా అవుతుందన్నారు.
కాగా అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ. 2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారని కాగ్ నివేదికలో వెల్లడించిందని చెప్పారు. గత ప్రభుత్వం వందల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించామని చెప్పినా వాస్తవంగా గ్రామాల్లో ఏమి నిర్మించలేదని విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7 వేల కోట్లకే 30 ఏళ్లకు అమ్మేయడం ద్వారా భవిష్యత్తు ఆదాయాన్ని ముందే తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా, 2016 నుంచి 2024 మధ్యలో ప్రతి బడ్జెట్ సంవత్సరంలో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకుండా వదిలేశారని వివరించారు.