కోల్కత్తా : భారత జాతీయ స్థాయి రాజకీయాల్లో మరో సంచలనానికి తెర లేచింది. అధికార బీజేపీ పార్టీకి వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మళ్ళీ బీజం పడుతున్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. కాగా ఈ కొత్త కూటమి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఏర్పడే అవకాశాలే అధికంగా ఉన్నట్లు సమాచారం.
దీనికి ఊతం ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే రుజువుగా నిలుస్తున్నాయి. తాజాగా వీరి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుత దేశ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. బెంగాల్ సీఎం తనతో మాట్లాడినట్టు ట్విట్టర్ ద్వారా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ కాకుండా ఇతర సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాల్లో గవర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆయన ఆరోపించారు. కాగా ఇదిలా ఉండగా, ఈనెల 12వ తేదీన జరిగిన నాలుగు మున్సిపల్సంస్థల ఎన్నికల్లో అధికార తృణముల్ పార్టీ(టీఎంసీ) భారీ విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మీడియాతో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోందని ఆమె ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీతో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ సంబంధాలేవని కూడా ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలోచన లేకుండా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. తన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
ఈ సందర్భంగానే తమిళనాడు సీఎంతో తాను మాట్లాడినట్టు మమత వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం తమతో చేతులు కలపాలని సీపీఎంను అడిగినట్టు పేర్కొన్నారు. అయితే తనకు ఎవరిపై వ్యక్తిగతంగా ద్వేషం లేదని అన్నారు. ఇదే క్రమంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయకపోవడంపై మమత స్పష్టం చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను బలహీన పరచరాదనే ఉద్దేశ్యంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పారు. ఈసారి ఎస్పీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మమత బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని మమతా వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తామని మమత స్పష్టం చేశారు.