కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల మమతా బెనర్జీ మూడో సారి గెలిచి సంచలనానికి దారి తీశారు. ఈ రోజు మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే పెద్ద సంచలన నిర్ణయం ప్రకటించారు.
ఆమె బెంగాల్ డీజీపీ నీరజ్ నయన్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మునపటి డీజీపీ అయిన వీరేంద్రను తిరిగి పశ్చిమ బెంగాల్ కు డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింస చెలరేగింది అంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బిజేపీ వ్యాఖ్యలపై దీదీ ఇలా స్పందించారు. రాష్ట్రంలో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ఆమె ఆరోపించారు. ఇకపై బెంగాల్ లో శాంతిభద్రతలను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిని ఘర్షణలకు సంబంధించి గవర్నర్ కూడా డీజీపీని పిలిచి ఆరా తీశారు.
దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై నివేదిక కోరిన సంగతి తెలిసిందే. సీఎం ప్రమాణం చేసిన అనంతరం మమతా బెనర్జీ తన తొలి ప్రాధాన్యత కోవిడ్ కట్టడే అని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా ప్రారంభించారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ పంపాలని కోరుతూ దీదీ కేంద్రానికి లేఖ రాశారు.