సూరత్ : ఒక భర్త తన భార్య డిమాండ్లను నెరవేర్చటానికి దొంగ అవతారం ఎత్తాడు. తన భార్యకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వటానికి బైకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
గుజరాత్ భావ్‌నగర్ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కానీ అతడి భార్యకు మాత్రం వారి సాధారణ జీవితం నచ్చలేదు. తన జీవితాన్ని ధనవంతురాలైన ఆమె అక్క జీవితంతో పోల్చుకునేది. బిల్డర్ అయిన అక్క భర్తతో తన భర్తను పోలిక పెట్టేది. ప్రతి రోజు మూతి విరుపులు, దెప్పిపొడుపులు చేసి భర్తను విసిగించేది.
ఇక ఇంట్లో తన భార్య పోరును భరించలేక బైకుల దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. కాగా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బైకుల దొంగతనాలను మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దానితో జైలు పాలయ్యాడు.