హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల చోటు చేసుకున్న వివాదాలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు.
సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, బహిరంగంగా సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని “మా” సభ్యులకు సూచించారు.
సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వాల నుంచి లభించిన మద్దతును ఆయన ప్రశంసించారు.
చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమను స్థిరపడేందుకు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ అన్ని ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగించడం అనివార్యమని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా, వివాదాస్పద అంశాలపై స్పందించడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని, చట్టాన్ని తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని సూచించారు.
“మా” సభ్యులంతా ఐక్యంగా సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తక్షణం సహనం, సానుభూతి, ఐక్యత అవసరమని గుర్తుచేసిన విష్ణు, క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.