తిరుమల: మంచు విష్ణు & ప్రకాష్ రాజ్ మధ్య మళ్ళీ ముదిరిన వివాదం
తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది.
అయితే శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
“మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యు ఇది. ఎంక్వరీ చేయండి. దయచేసి విచారించండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు మరియు సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో జరుగుతున్న మత కల్లోలాలు చాలు అని ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు స్పందించారు.
“ప్రకాశ్ రాజ్ దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించవద్దని హితవు పలికారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన దేవాలయంలో లడ్డూ వివాదంకు సంబంధించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కోరారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి” అని మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ కు ట్విటర్ వేదికగా సూచించారు.
మంచు విష్ణు పెట్టిన పోస్ట్‌కు ప్రకాశ్‌రాజ్ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు.
‘😂😂😂😂ఓకే శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి #జస్ట్ ఆస్కింగ్’’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం వీళ్లద్దరి మధ్య ఎక్స్ వేదికగా జరిగిన ఈ చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది. గతంలోనూ ‘మా’ ఎన్నికల సందర్భంగా అటు ప్రకాశ్‌రాజ్, ఇటు మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఎక్స్ వేదికగా ఒకరి స్పందనలకు మరొకరు రిప్లై ఇస్తూ వార్తల్లో నిలిచారు.