అమరావతి: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలను విచారించిన మంగళగిరి పోలీసులు
మంగళగిరి, టీడీపీ ఆఫీస్‌పై 2021లో జరిగిన దాడి కేసులో కీలకంగా ఉన్న వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు నేడు విచారించారు. సజ్జలకు నిన్న పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయగా, ఆయన ఇవాళ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.
38 ప్రశ్నలు – సజ్జల స్పందన
మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సజ్జలను 38 ప్రశ్నలతో విచారించామని తెలిపారు. ఈ ప్రశ్నలన్నిటికీ సజ్జలు “గుర్తు లేదు” అని సమాధానమిచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సజ్జలు కీలక సలహాదారుగా ఉన్నారని, ఆ సమయంలోని కార్యకలాపాల గురించి ఆధారాలతో విచారించామని తెలిపారు. కానీ, సజ్జలు తమ ప్రశ్నలకు సహకరించలేదని, ఫోన్ ఇవ్వలేదని సీఐ వెల్లడించారు.
సజ్జల పాత్రపై ఆధారాలు
“టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో తాను అక్కడ లేనని సజ్జలు పేర్కొన్నారు. కానీ, సజ్జల పాత్రపై మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు దాదాపు మూడు నెలలుగా దర్యాప్తులో ఉంది, ఇది చివరి దశకు చేరుకుంది. నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందడం వల్ల విచారణలో ఆలస్యం జరిగింది. నిందితులను అరెస్టు చేస్తే విచారణ వేగంగా పూర్తవుతుంది,” అని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
సీఐడీకి అప్పగించే కేసు
ప్రస్తుతానికి ఈ కేసు రాష్ట్ర సర్కారు సీఐడీకి అప్పగించినట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే కేసు దర్యాప్తు పత్రాలను సీఐడీకి అందజేస్తామని అధికారులు చెప్పారు.
పోలీసులతో న్యాయవాది వాగ్వాదం
సజ్జల విచారణకు హాజరైన సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సజ్జలకు సహకారం అందించేందుకు వెళ్లిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, విచారణ అధికారితో పాటు తనను కూడా అనుమతించాలని కోరగా, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల ఆదేశాలను అంగీకరించకుండా, సుధాకర్ రెడ్డి పోలీసులను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.