ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా తన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. 2023 ఆగస్టులో జరిగిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కీలకంగా మారినప్పుడు, ఆరోగ్య పరిస్థితి ఎంత క్షీణించినా, వీల్‌చైర్‌లో హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అప్పట్లో ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రతిపక్షాలకు ప్రేరణగా నిలిచింది. తుది ఫలితంపై నమ్మకమున్నా, ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో మన్మోహన్ ఎంత నిబద్ధతతో వ్యవహరించారో ఈ సంఘటన ద్వారా స్పష్టమైంది.
దేశ ప్రజల కోసం బాధ్యతతో పని చేయడం ఆయన కృషికి నిదర్శనం. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో మన్మోహన్ ధృఢతను ప్రశంసిస్తూ, ప్రతి నాయకుడు ఆయన నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్నారు.
మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణలు, ప్రజాస్వామ్యానికి చేసిన సేవలు తరతరాలకూ స్ఫూర్తిగా ఉంటాయి. ఆయన జీవితం క్రమశిక్షణ, కర్తవ్యబద్ధత, సేవా భావానికి ప్రతీకగా నిలిచింది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.