ఝార్ఖండ్: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లా లుగు పర్వతాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఇందులో రూ. కోటి రివార్డ్ ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కూడా ఉండటం కలకలం రేపుతోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది.
లాల్‌పానియా సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురైనట్టు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలతో తీవ్ర కాల్పులు జరిగిన తర్వాత మావోయిస్టులు అడవిలోకి పరారయ్యారు. అనంతరం జరిపిన గాలింపులో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి.
ప్రయాగ్ మాంఝీపై జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో 100కు పైగా కేసులు ఉన్నాయి. గిరిధి జిల్లాలో మాత్రమే 50కిపైగా కేసులు నమోదయ్యాయి. అతడి మరణంతో జార్ఖండ్ భద్రతా వ్యవస్థకు ఊరట లభించింది.
మృతుడి స్వస్థలం ధన్‌బాద్ జిల్లా తుండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్‌బుద గ్రామం. ప్రశాంత్ హిల్స్‌ను బేస్‌గా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించినట్లు సమాచారం.