గినియా: ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారికి కళ్లెం వేయకముందే ఇప్పుడు మానవాళి జీవితంలోకి మరొక కొత్త సమస్య వచ్చింది. కోవిడ్ నుండి ఇంకా ప్రజలు కోలుకోకముందే ఇప్పుడు ఇంకో మహమ్మారి వేగంగా తరుముకొస్తోంది. అయితే ఇది కరోనా కన్నా మరింత ప్రమాదకారి అని, ఇది ఒక్కసారి సోకితే మరణం సంభవిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
తాజాగా పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఒక ప్రమాదకర వైరస్ బయటపడింది. ఈ కొత్త వైరస్ పేరు మార్‌బర్గ్ అని, ఈ వైరస్ కూడా గబ్బిలాల ద్వారానే మనుషులకు సంక్రమిస్తుందని, కాగా ఇది సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
కాగా ఇటీవల ఆగస్టు 2వ తేదీన చనిపోయిన ఒక వ్యక్తిలో మార్బర్గ్ వైరస్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మొదటి మార్‌బర్గ్ కేసును దక్షిణ గెక్‌కెడౌ ప్రిఫెక్చర్ ప్రాంతంలో గుర్తించినట్లు ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయెటి తెలిపారు. మార్‌బర్గ్ వైరస్ చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉందని, దానిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మత్షిడిసో పేర్కొన్నారు.
మార్‌బర్గ్ వైరస్ ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన ఒక వైరస్. అయితే ఇది ఎబోలా కన్నా చాలా ప్రమాదకారి. కాగా ఈ వైరస్ సోకిన వారు రక్తస్రావ జ్వరం తో బాధపడతారనొ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 1967లో జర్మనీ, బెల్‌గ్రేడ్, సెర్బియాలో ఒకేసారి రెండు అంటువ్యాధులు వెలుగు చూశాయి. అదే క్రమంలో మార్‌బర్గ్, ప్రాంక్‌ఫర్ట్ వ్యాధులను గుర్తించారు. ఉగాండ నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రీకన్ ఆకుపచ్చ కోతుల మీద పరిశోధన చేస్తున్న ల్యాబ్ నుంచి ఈ రెండు అంటువ్యాధులు బయటకు విడుదల అవడం జరిగింది.
ఈ కొత్త వైరస్ బారిన పడ్డ వారికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాక మూడవ రోజు నుండి తీవ్రమైన నీటి విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఒక వారం పాటు కొనసాగుతాయి. వారి కళ్లు లోపలికి పోయి, ముఖంలో ఏ భావాలు కనిపించకుండా ఉండటమే కాక, విపరీతమైన బద్ధకంగా ఉంటారు.
ఇక మలేరియా, టైపాయిడ్, షిగెలోసిస్, మెనింజైటిస్ వంటి వాటిని గుర్తించినంత సులభంగా మార్‌బర్గ్‌ను గుర్తించడం కుదరదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. యాంటిజెన్ డిటెక్షన్ పరీక్షలు, సీరం న్యూట్రలైజేషన్ పరీక్షలు, సెల్ కల్చర్, ఆర్‌టీపీసీఆర్ ఉపయోగించి వైరస్ నిర్ధారణ చేయవచ్చిన పేర్కొంది.